హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లి గ్రామ సర్వే నంబరు 36, 37లోని 182 ఎకరాలను ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎన్జీవోలకు కేటాయించారు. సర్వే అనంతరం భూమిని స్వాధీనం చేసుకున్న ఉద్యోగులు జీహెచ్ఎంసీకి రూ.18 కోట్లు చెల్లించి 142 ఎకరాల్లో అధికారికంగా లేఅవుట్ చేశారు. అనంతరం కోర్టు వివాదాల కారణంగా భాగ్యనగర్ టీఎన్జీవోలు భూమి కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. కొన్నిరోజుల కిందట ప్రభుత్వ పెద్దల అండతో ప్రైవేటు వ్యక్తులు కొందరు రాత్రికి రాత్రి అందులో 40 ఎకరాల భూమిని ఆక్రమించి లేఅవుట్ చేశారు. ఇదేమంటే ఏడీ సర్వేలో తమకు హద్దులు చూపారని ప్రైవేటు వ్యక్తులు స్పష్టం చేశారు. న్యాయ వివాదంలో ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా సర్వే ముగించడం ఏడీ శ్రీనివాసులుకే చెల్లింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎపిసోడ్లో కూడా ఏడీ శ్రీనివాసులుది కీలక పాత్ర. గత సర్వే నివేదికలన్నింటికీ భిన్నంగా రాత్రికి రాత్రి సర్వే ముగించారు. పక్క భూమి యజమానికి నోటీసు ఇవ్వకుండా సర్వే చేసి ప్రహరీ దాటి హద్దులను నిర్ధారించారు. దశాబ్దాలుగా అనుభవిస్తున్న భూమి నీది కాదు… పక్కవారిది అంటూ ఏకపక్షంగా సర్వే నివేదికను చేతులో పెట్టారు. ఇదేమని ప్రశ్నిస్తే నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. చివరకు హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప బాధితుడికి ఉపశమనం కలగలేదు.
ఇబ్రహీంపట్నం మండలం ఖానాపూర్ గ్రామ పరిధిలో సర్వేనంబరు 43లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చి ఏడీ సర్వే నివేదికలు ఇచ్చినట్టు తెలిసింది. ఇక్కడే కాదు.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు కూడా ఇన్చార్జి కావడంతో శంషీగూడ పరిధిలోని ప్రభుత్వ భూముల్ని ప్రైవేటుపరం చేయడంలో శ్రీనివాసులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ప్రచారం జరుగుతున్నది.
రెండు రోజుల కిందట ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు భూమేతకు మచ్చుకు రెండు తాజా ఉదాహరణలు మాత్రమే. ఇంకా వెలుగుచూడని, బాధితులు గోడు సైతం బయటికి వినిపించని భూ దందాలు ఇంకెన్నో! ప్రధానంగా రెండేండ్లుగా ప్రభుత్వ పెద్దలతో పాటు బడాబాబులకు సంబంధించి ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంతో పాటు వివాదాస్పద భూముల హద్దులను క్షణాల్లో తారుమారు చేయడం శ్రీనివాసులుకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. అందుకే ఏసీబీ దాడుల్లో వందల కోట్ల అక్రమాస్తులు వెలుగుచూశాయి.
రంగారెడ్డి జిల్లా అంటేనే భూములు బంగారం. అందుకే భూ వివాదాలు కూడా వేలల్లో ఉన్నాయి. ఈ క్రమంలో రెండేండ్లుగా విలువైన ప్రభుత్వ భూములు ఇబ్బడిముబ్బడిగా కైంకర్యం అవుతున్న దాఖలాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ రైతులకు సంబంధించి భూ సర్వే దరఖాస్తులు వేలల్లో ఉన్నప్పటికీ అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. కానీ బడాబాబులు, ప్రభుత్వ పెద్దలు కొందరికి సంబంధించిన అంశాల్లో రాత్రికి రాత్రి ఏడీ సర్వే ముగుస్తుండటం రెవె న్యూ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం. ప్రధానంగా జిల్లాలో సర్వే ప్రక్రియను తన గుప్పి ట్లో పెట్టుకున్న ఏడీ శ్రీనివాసులు హై ప్రొఫైల్ కేసులు మినహా సాధారణ రైతుల భూ సమస్యలకు మాత్రం సమయాన్ని వెచ్చించబోరనేది బహిరంగ రహస్యం.
బడాబాబులు, ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన భూ అంశాల్లో పక్కనున్న సామాన్యుల భూములకు ఎసరు పెట్టడంలో శ్రీనివాసులు దిట్ట. నిబంధనల ప్రకారం పక్కనున్న భూముల వారికి ముందుగా నోటీసులు ఇచ్చి సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్కరికీ నోటీసులు ఇవ్వకుండా… అసలు సర్వే ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియకుండానే ముందుగా అనుకున్నవారికి అనుకూలంగా సర్వే నివేదికలు ఇవ్వడంలో శ్రీనివాసులుది అందెవేసిన చెయ్యి అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండ ఉండటంతో బాధితులు ప్రశ్నించినా, న్యా యస్థానాలను ఆశ్రయించినా ఖాతరు చేసిన దాఖలాలు లేవు. చివరకు గోపన్‌పల్లిలోని సర్వే నంబరు 36, 37ల్లో ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన భూమిని సైతం ప్రైవేటుపరం చేయడంలో శ్రీనివాసులు అత్యుత్సాహం చూపారు. ఇదెక్కడి న్యాయమని తోటి ఉద్యోగులు ప్రశ్నించినా ప్రైవేటు వ్యక్తులకు అండగా నిలిచారు. ఇలా విలువైన భూములపైనే దృష్టిసారించి కేవలం ఆ పనులు మాత్రమే పూర్తి చేయడంతో కొన్ని కేసుల్లో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారనేందుకు ఏసీబీ దాడుల్లో బయటికొచ్చిన ఆస్తులే నిదర్శనం.
సీనియర్లు రాకుండా ఏకచత్రాధిపత్యం…
రంగారెడ్డి జిల్లాలో భూములు విలువైనవి కావడంతోపాటు భూ హద్దులు, సర్వే సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటా యి. దీనికి తోడు గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం నగరం చుట్టూనే అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చి రైతుల భూములను సేకరిస్తున్నది. దాదాపు 30 మంది వరకు సర్వేయర్లు ఉండాల్సి ఉంటే అందులో సగం కూడా లేరు. అసలు పెద్దగా భూ సర్వే సమస్యలులేని హైదరాబాద్ జిల్లాలో మాత్రం పూర్తిస్థాయి సర్వేయర్లు ఉన్నారు. పైగా వీరిలో ఎక్కువగా 20-25 సంవత్సరాల సీనియర్లు ఉన్నారు. కానీ రంగారెడ్డి జిల్లాకు మాత్రం సర్వేయర్ల కేటాయింపు జరగడం లేదు. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల కిందట పలువురు రెవెన్యూ ఉన్నతాధికారులు సర్వే సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నందున సర్వేయర్లను కేటాయించాలని సీఎంవో దృష్టికి తీసుకుపోయారు.
దీంతో హైదరాబాద్ జిల్లా నుంచి ఏడుగురిని డిప్యుటేషన్‌పై రంగారెడ్డి జిల్లాకు పంపారు. కానీ ఏడీ శ్రీనివాసులు పావులు కదిపి వారందరినీ తిరిగి హైదరాబాద్ జిల్లాకు వెనక్కి పంపించేదాకా విశ్రమించలేదని తెలిసింది. కారణం… ఇతర సీనియర్లు ఉంటే తన ఏకచత్రాధిపత్యం నడవదు. పైగా గండిపేట మండలంలో భూములు ఎంత విలువైనవో… అక్కడ సర్వే అంశాలు ఎంత క్లిష్టమైనవో అందరికీ తెలిసిందే. ఇలాంటిచోట 2018లో నియామకమైన సర్వేయర్‌కు పోస్టింగ్ ఇప్పించుకుని శ్రీనివాసులు తన వెంట తిప్పుకున్నారనేది అందరికీ తెలుసు. అంటే సీనియర్లు కాకుండా ఇలాంటి జూనియర్లు ఉంటే తాను ఆడిందే ఆటగా సాగుతుందనేది శ్రీనివాసులు ఉద్దేశమనేది అర్థమవుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు… అందునా రెవెన్యూ శాఖకు చెందిన కీలకమైన పెద్దల అండ ఉండటంతో కండ్ల ముందు రంగారెడ్డి జిల్లాలో సర్వేయర్ల కొరత ఉన్నా ఇతర ఉన్నతాధికారులెవరూ కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే సాహసం కూడా చేయరని తెలిసింది.
చంచల్‌గూడ జైలుకు ఏడీ
అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కే శ్రీనివాసులును అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గురువారం రాత్రి ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. మొత్తంగా ఆయన రూ.100 కోట్లకుపైగా విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్టు తేల్చారు.