పెద్దపల్లి రూరల్, నవంబర్ 8: 12 ఏండ్ల కింద ఇంటి నుంచి వెళ్లి తిరిగొచ్చిన కొడుకును చూసి పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని రంగాపూర్‌కు చెందిన తల్లి పట్టెం లక్ష్మి భావోద్వేగానికి లోనైంది. కొడుకును చూసి సంబురపడింది. వివరాలు ఇలా.. పెద్దపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన పట్టెం మల్లయ్య-లక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు వెంకటరాములు.
అందులో ఇద్దరు కూతుళ్లకు వివాహాలు కాగా, మూడో కూతురు దివ్యాంగురాలు కావడంతో ఇంటి వద్దనే ఉంటున్నది. కొడుకు వెంకటరాములు మానసిక పరిస్థితి బాగాలేకనో? ఇంటి ఆర్థిక పరిస్థితులు కారణమో తెలియదు గానీ, 2013లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని కోసం ఏండ్లపాటు వెతికినా ఆచూకీ దొరకలేదు. ఎటు పోయాడో? ఎక్కడ ఉన్నాడో? తెలియక సతమతమయ్యారు. చివరకు ఆశలు వదులుకున్నారు.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం వెంకట రాములు అస్సాంలోని ఒక హోటల్లో ఉంటున్నట్టు అక్కడి పోలీసుల ద్వారా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్‌కు సమాచారం వచ్చింది. రంగాపూర్ మాజీ సర్పంచ్ గంట లావణ్యరమేశ్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అస్సాం నుంచి ప్రత్యేక బృందం ద్వారా అతడిని శనివారం పెద్దపల్లికి రప్పించి తల్లి లక్ష్మిచెంతకు చేర్చారు. 12 ఏండ్ల తర్వాత ఇంటికి చేరిన కొడుకును చూసి తల్లి సంబురపడింది. వెంకటరాములును సొంతూరికి తీసుకొచ్చిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, మాజీ సర్పంచ్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.