శంషాబాద్ రూరల్, జనవరి 3: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామంలోని ‘ఆ 52 ఎకరాల భూమి ప్రభుత్వానిదే..’ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. కాగా, ఆ భూములపై జిల్లా రెండో అదనపు న్యాయస్థానం తీర్పునిచ్చిందంటూ ఇటీవలే ప్రభుత్వ న్యాయవాది రెవెన్యూ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం సర్వే నంబర్ 54లోని 52 ఎకరాల భూమి సర్కారు దేనని సూచిస్తూ తహసీల్దార్ రవీంద్ర దత్ సిబ్బందితో కలిసి బోర్డులను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు రూ.250 కోట్ల విలువచేసే సర్కారు భూములను కాపాడేందుకు కొన్నాళ్లుగా రెవెన్యూ అధికారులు న్యాయస్థానంలో పోరాటం చేశారని తెలిపారు. ఈ భూముల్లో ప్రస్తుతం కన్వెన్షన్ సెంటర్, కొన్ని నిర్మాణాలను గుర్తించామని, త్వరలోనే అధికారుల ఆదేశాలతో వాటిని తొలగించి ప్రజావసరాల కోసం భూములను కేటాయిస్తామని పేర్కొన్నారు. విలువైన భూములను కాపాడేందుకు ప్రభుత్వ అధికారులు తీసుకున్న చొరవపై ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. భూములను పేదల ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.