హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలోనే కాదు, అధికార కాంగ్రెస్‌లోనూ ‘ముఖ్య’నేత వర్సెస్ కీలక నేతల పర్వం కొనసాగుతున్నది. తాజాగా పార్టీ అధిష్ఠానం డీసీసీ అధ్యక్ష పదవుల భర్తీ ప్రక్రియను చేపట్టగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కుమ్ములాటలు తెర మీదకొచ్చాయి. కానీ కీలకమైన రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఏకంగా ‘ముఖ్య’నేత బంధువు బరిలో నిలవడం, మిగిలిన ఆశావహులు అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. చివరకు ఈ వ్యవహారం చినికి చినికి పార్టీ పరిశీలకుడిని సైతం చుట్టుముట్టడం మరింత ఆసక్తిని రేపుతున్నది. హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన రంగారెడ్డి జిల్లాకు రాజకీయంగానూ గణనీయమైన ప్రాధాన్యం ఉంటుంది. అందులోనూ, అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు అంటే ఆ పదవికి పోటీ కూడా ఎక్కువగానే ఉండటం సహజం.
డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడటం సాధారణమే అయినప్పటికీ తెరవెనక ‘ముఖ్య’నేత స్థాయిలో ఈ పదవి కోసం పావులు కదుపుతుండటం పార్టీపరంగానే కాకుండా రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం అధిష్ఠానం కాంగ్రెస్ ఎంపీ రాబర్ట్ బ్రూస్‌ను పరిశీలకుడిగా నియమించింది. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి పదుల సంఖ్యలో నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉండే జనగామ జిల్లాకు చెందిన నేత దరఖాస్తు చేసుకోవడం రగడకు దారి తీసింది.
‘ముఖ్య’నేత సోదరుడికి దగ్గరి బంధువుగా చెప్తున్న సదరు నేత జలమండలి (హైదరాబాద్ వాటర్ వర్క్స్)లోనూ కార్మిక సంఘాల్లోనూ ప్రవేశించడంతో అప్పటికే ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు యూనియన్ రెండుగా చీలిందనే ఆరోపణలున్నాయి. అయితే రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి సదరు నేత దరఖాస్తు చేసుకోవడంతో జిల్లాకు సంబంధంలేని నేత దరఖాస్తును ఎలా పరిగణలోనికి తీసుకుంటారంటూ మిగిలిన ఆశావహులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అధిష్ఠానం పంపిన పరిశీలకుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమావేశాల్లో భాగంగా ఎల్బీనగర్ సమావేశంలోనూ ఇదే అంశం ప్రధాన చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయినప్పటికీ తెరవెనక ‘ముఖ్య’నేత ప్రభావం ఉండటంతో ఈ అసంతృప్తిని పరిశీలకుడు పెద్దగా పరిగణలోనికి తీసుకోనట్టుగా మిగిలిన వారు చెప్తుండడం గమనార్హం.
సదరు అధిష్ఠానం దూత తాము లేవనెత్తుతున్న అంశంపై పెద్దగా దృష్టిసారించడం లేదని మిగిలిన ఆశావహులందరూ ఏకంగా అధిష్ఠానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ‘ముఖ్య’నేత బంధువుకు రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి సంబంధంలేదని, ఇక్కడి క్యాడర్‌కు కూడా ఆయన ఎవరో తెలియదని, ఈ క్రమంలో రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి చేసిన దరఖాస్తును తిరస్కరించాలని అందులో అధిష్ఠానాన్ని కోరారు. పదహారు మంది సంతకాలు చేసి ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్తో పాటు పరిశీలకుడు బ్రూస్‌కు కూడా ఫిర్యాదును పంపారు.
కాగా ‘ముఖ్య’నేత తమ బంధువుకు రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి దక్కేలా సహకరించాల్సిందిగా ఓ మాజీ డీసీసీ అధ్యక్షుడిని కూడా పురమాయించినట్టు సమాచారం. వాస్తవానికి డీసీసీ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆశావహులు ఎవరూ ఎన్నిక పరిశీలకులను నేరుగా కలవొద్దనేది పార్టీ మార్గదర్శకాల్లో ఒకటిగా తెలిసింది. కానీ ఇందుకు విరుద్ధంగా ఆ మాజీ డీసీసీ అధ్యక్షుడు దరఖాస్తు చేసుకున్న ‘ముఖ్య’నేత బంధువును గోల్కొండ హోటల్‌కు తీసుకుపోయి కలిపించినట్టుగా కూడా ఫిర్యాదుకు జోడించినట్టు తెలుస్తున్నది. హోటల్లో మాజీ డీసీసీ అధ్యక్షుడు, దరఖాస్తుదారుడు ఉన్న ఫొటోలను పంపడం కొసమెరుపు.