యాచారం, ఆగస్టు 12: ఫోర్జరీ సంతకాలతో ఓ విలేజ్ బుక్ కీపర్ కోటి రూపాయలు స్వాహా చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. యాచారం మండలం చౌదర్పల్లిలో వరమ్మ ఐకేపీలో విలేజ్ బుక్ కీపర్‌గా పనిచేస్తున్నది. ఇక్కడ 40 వరకు డ్వాక్రా పొదుపు సంఘాలు ఉన్నాయి. కొంతమంది డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించినా వారికి బ్యాంకు నుంచి రుణాలు చెల్లించాలని నోటీసులు రావడంతో అవాక్కయ్యారు. మంగళవారం మండలకేంద్రంలోని ఎస్బీఐకి వెళ్లి స్టేట్మెంట్ చూడగా వరమ్మ బాగోతం బయటపడింది.
ప్రతినెలా పొదుపు డబ్బులను సేకరించి వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయకపోవడం, అవసరాలకు వాడుకోవడంతో కోటిన్నరకుపైగా అవినీతి జరిగినట్టు తేలింది. దీంతో మహిళలు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నాగార్జున సాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మహిళలు, బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి సమస్యను అడిగితెలుసుకున్నారు. నిందితులను వదలొద్దని సీఐ నందీశ్వర్రెడ్డిని ఆదేశించారు. ఈ లావాదేవీలు గతంలో జరిగాయని, విచారణ జరిపించి నిందితులపై చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.