హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసులో విచారణ నిమిత్తం సినీ నటుడు రాణా, ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ శనివారం తెలంగాణ సీఐడీ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు దాదాపు గంటన్నరపాటు రానాను ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో రానా చేసుకున్న ఒప్పందం, ఆ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా రానాకు వచ్చిన పారితోషికంపై లోతుగా ఆరా తీశారు. అనంతరం రానా మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రమోట్ చేసిన యాప్ చట్టబద్ధమైనదని తెలుసుకున్నాకే ప్రచారం చేశాని చెప్పారు.
సిల్ బేస్డ్ గేమ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న ఏ సంస్థతో తాను ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సీఐడీకి చెప్పానని పేర్కొంటూ.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు టాలీవుడ్‌లోని 29 మంది సెలబ్రిటీలతోపాటు వివిధ కంపెనీలపై సీఐడీ, ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల సినీ నటులు విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్ తదితరులను ప్రశ్నించిన సీఐడీ అధికారులు.. తాజాగా రానా, విష్ణుప్రియ వాంగ్మూలాలను నమోదు చేశారు.