Harish Rao | తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. కానీ, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పాలనలో ఏం చేసిందో నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసని అన్నారు. రంజాన్ నెలలో పేద ముస్లిం సోదరుల కుటుంబాలకు కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చేవారని.. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రంజాన్ తోఫా బంద్ అయిపోయిందని అన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మదీనా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ సోదరులకు కేసీఆర్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న గత 12-13 ఏండ్లుగా ప్రతి ఏటా ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నానని చెప్పారు. మీకు, నాకు మధ్య ఉన్నది విడదీయరాని బంధమని వ్యాఖ్యానించారు. మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కూళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విలీనం చేస్తున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పటివరకు ఈ స్కూళ్లకు ఉన్న మైనారిటీ గుర్తింపు లేకుండా పోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో హోంమంత్రిగా మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్ అలీని కేసీఆర్ నియమించి గౌరవం ఇచ్చారని తెలిపారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులను నియమించినా అందులో మైనారిటీ మంత్రి ఉన్నారని.. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 మంది మంత్రులను నియమించినా అందులో ఒక్క మైనారిటీ మంత్రికి కూడా చోటు లేరని విమర్శించారు. మైనారిటీ వారు మంత్రిగా ఉండాలి కదా. ఆ ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలె అని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో ఎక్కడా గొడవలు లేవు, కానీ ఇవాళ చాలాచోట్ల గొడవలు జరుగుతున్నాయని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో మైనారిటీల కోసం 3 వేల కోట్లు పెట్టింది. కానీ, వెయ్యి కోట్లు మాత్రమే విడుదల చేసిందని అన్నారు. అవి కూడా ఖర్చు చేయలేదు, దీనిపై నేను అసెంబ్లీలో ప్రశ్నించానని తెలిపారు. 40 ఏండ్ల నుంచి అడుగుతున్నా ఇక్కడ మదీనా మసీదు మరమ్మత్తులు చేయలేదని.. కేసీఆర్ హయాంలోనే పనులు చేపట్టారని గుర్తుచేశారు. స్థలం సరిపోకపోతే 10 కోట్ల రూపాయలతో సేకరించమని కేసీఆర్ చెప్పారని అన్నారు. 4 కోట్ల రూపాయలతో మదీనా ఫంక్షన్ హాల్ షాదీఖానా నిర్మాణం చేపట్టారని చెప్పారు. ప్రజ్ఞాపూర్, తూఫ్రాన్ తో పాటు, జిల్లాలో అంతటా ఖబరస్తాన్ పనులు చేపట్టారని అన్నారు. కేసీఆర్ మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని.. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పనులను తిరిగి ప్రారంభించాలని కోరారు.