ఇబ్రహీంపట్నం, మార్చి 26: సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన రామోజీ ఫిలింసిటీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి యాదయ్య నేతృత్వంలో వందల మంది నాయకులు, కార్యకర్తలు నాగన్‌పల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకునూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు రామోజీ ఫిలింసిటీకి ర్యాలీగా బయలుదేరారు. విషయం తెలియటంతో పోలీసులు ఫిలింసిటీ ప్రధాన గేటు వద్ద మోహరించారు. దీంతో సీపీఎం కార్యకర్తలు గేట్లపై నుంచి దూకి లోపలికి వెళ్లారు. అక్కడ గుడిసెలు వేయటానికి ప్రయత్నించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరిస్తామని, బయటకు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. అనంతరం నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించగా.. సీపీఎం కార్యకర్తలు, లబ్ధిదారులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అతికష్టం మీద సీపీఎం నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు.
పేదల భూములు తిరిగివ్వాలి: జాన్‌వెస్లీ
పేదల భూములను వారికి తిరిగి ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రామోజీ ఫిలింసిటీ వెనుకగేటు వద్ద నాగన్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్ 80లో సుమారు 30 ఎకరాల భూమిని రాయపోల్, పోల్కంపల్లి, ముకునూరు, నాగన్‌పల్లికి చెందిన సుమారు 500 మంది నిరుపేదలకు 2007లో అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ భూముల చుట్టూ రామోజీరావు ప్రహరీ నిర్మించి పేదలు లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదల ఇండ్ల స్థలాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2007 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతున్నదని తెలిపారు. పేదల ఆందోళనను పట్టించుకోకుండా ఆ భూముల్లో స్టూడియో నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. రామోజీరావు ఆక్రమించిన భూమి విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే పేదల ఇండ్ల స్థలాలను వారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు.
29 మందిపై కేసులు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, పలువురు జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు, మరో 29 మందిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసులు అరెస్టుచేసిన వారిలో నాయకులు కాడిగల్ల భాస్కర్, బోడ సామేల్, జగదీశ్, కందుకూరి జగన్, పంది జగన్, బుగ్గ రాములు, వెంకటేశ్, జంగయ్యతో పాటు పలువురు లబ్ధిదారులు ఉన్నారు.
పోరాటం ఆగదు: పగడాల యాదయ్య
పేదల భూముల్లోకి రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం రానివ్వడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య ఆరోపించారు. ప్లాట్లు అప్పగించే వరకు పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. అక్రమ అరెస్టులకు నిరసనగా గురు, శుక్రవారాల్లో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
రామోజీ యాజమాన్యంపై కేసు పెట్టాలి
ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు, రోడ్లు, 350 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ ఫిలింసిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి వెళ్లిన పేదలు, వారికి మద్దతుగా వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు జిల్లా నాయకులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పేదలకు 2007లో అప్పటి సర్కారు ఇచ్చిన పట్టా భూముల్లో అడుగు పెట్టిన 75 మందిపై గతంలో అక్రమ కేసులు పెట్టి ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం తిప్పిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, పోలీసులు రామోజీ సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రామోజీ సంస్థ ఆక్రమించిన 350 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకుని గుడిసెలు వేసే కార్యక్రమానికి పూనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.