రంగారెడ్డి, జూలై 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్‌రావు నియామకమయ్యారు. రాంచందర్‌రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్ శివారు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని వేద కన్వెన్షన్హాల్లో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాంచందర్‌రావుకు పార్టీ పరిశీలకురాలు శోభాకరంద్లాజే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చేతుల మీదుగా నియామకపత్రం అందజేశారు. రాంచందర్‌రావు ఎంపికపై తీవ్ర అసంతృప్తితో ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయగా, ఎంపీలు రఘునందన్‌రావు, అరవింద్ కార్యక్రమానికి దూరంగా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో అసమ్మతి ముదిరిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన రాంచందర్‌రావు మాట్లాడుతూ.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి తగిన న్యాయం జరుగుతుందని, ఆ విషయం తన నియామకంతోనే స్పష్టమైందని తెలిపారు. తెలంగాణాలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పారు. తనకు అధ్యక్ష పదవిని అప్పగించినందుకు ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా, జాతీయ నేతలు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
దేశానికి ప్రధాని మోదీ సారథ్యం చాలా అవసరమని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తెలిపారు. మోదీ ద్వారానే సంక్షేమం, అభివృద్ధి సాకారమవుతాయని చెప్పారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడం మోదీకే సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అభివృద్ధి కోసం రాంచందర్‌రావు సారథ్యంలో ముందుకెళ్లాల్సిన అవసరముందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఎంపీలు ఈటల రాజేందర్, విశ్వేశ్వర్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.