షాద్‌నగర్, నవంబర్ 15 : కొడంగల్ సెగ్మెంట్‌ను సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అన్నీ తానై శాసిస్తున్నారని, ఏ హోదాతో అతనికి కలెక్టర్, అధికారులు స్వాగతం పలుకుతున్నారని లంబాడా హక్కుల పరిరక్షణ సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్‌నాయక్ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు గ్రామాల ప్రజలు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ పది నెలలుగా నిరసనలు చేపడుతుంటే.. కనీసం వారితో చర్చించకుండా బెదిరింపులకు దిగడం రేవంత్‌రెడ్డి సర్కారుకు తగదని సూచించారు.
గ్రామసభలో కల్టెకర్ మాట్లాడుతుండగా కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా భూములను గుంజుకుంటామని చెప్పడంతో ప్రజలు ఆగ్రహానికి గురై అధికారులపై దాడులకు ప్రయత్నించారని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. లగచర్లతోపాటు గిరిజన తండాల్లో పోలీస్ బందోబస్తును ఎత్తి వేయాలని, రైతులపై కేసులను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొడంగల్‌లోని లగచర్లలో జరిగింది దాడి కాదు. అది ప్రజల తిరుగుబాటు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఆ గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలువదా? ఎందుకు లంబాడీల భూములను గుంజుకోవాలని చూస్తున్నారు? ఫార్మాసిటీ కోసం ముచ్చర్లలో ప్రభుత్వం 14 వేల ఎకరాల భూమిని సేకరించింది.. అక్కడే ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలి.
– భూక్యా సంజీవ్‌నాయక్, సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు
సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ బిడ్డలపై ప్రేమ ఉంటే ముచ్చర్లలో ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలి. కొడంగల్‌లో ఉన్న గిరిజనుల భూములను లాక్కోవద్దు. సీఎం సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫార్మా పేరుతో గిరిజనుల భూములను గుంజుకుంటున్నారు. ఇది సరైనది కాదు.
– గణేశ్‌నాయక్, నగారాభేరి లంబాడీ హక్కుల పోరాట సమితి
లంబాడీలకు లడాయి కొత్త కాదు. చావనైనా చస్తాం కానీ భూములను వదులుకునే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్‌రెడ్డి తన అల్లుడికి ఇవ్వాల్సిన భూమి కోసం లంబాడీల భూములపై పడితే కొడంగల్‌లో తిరుగుబాటు జెండా ఎగురేస్తాం. లంబాడీలపై కక్ష కట్టి జైలుకి పంపడం అంటే.. మీ గోతులు మీరే తీసుకుంటున్నారు. లంబాడ బిడ్డలను వెంటనే విడుదల చేయాలి. వారిని హింసించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
– గుగులోతు భీమా నాయక్, లంబాడీ హకుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు