హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): గిరిజన మహిళ సింగర్ మంగ్లీని కావాలని కేసులో ఇరికించే కుట్ర జరుగుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబల్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన మహిళంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు అని..? అని ప్రశ్నించారు.
మహిళలున్న గదుల్లోకి వెళ్లి పోలీసులు వీడియోలు తీయడమే కాకుండా.. వాటిని బహిర్గతం చేయడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. తక్షణమే బర్త్డే పార్టీలో పోలీసులు తీసిన వీడియోలను డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. 50మంది ఆత్మీయులతో బర్త్డే వేడుకలు జరుపుకుంటున్న కార్యక్రమాన్ని వీడియోలు తీసి బహిర్గతం చేయడం సరికాదని అన్నారు.
బడాబాబులు నిర్వహించే రేవ్ పార్టీలను పట్టించుకోని పోలీసులు.. గిరిజన మహిళ నిర్వహించే చిన్న బర్త్డే పార్టీపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీలో ఎవరికో ఒకరికి గంజాయి పాజిటివ్ వస్తే.. దాన్ని మంగ్లీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిని గిరిజనులందరూ ఖండించాలని ఆయన కోరారు.