హైదరాబాద్, ఏప్రిల్29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నీటి హక్కుల సాధనకు ఇంజినీర్ విద్యాసాగర్‌రావు చేసిన కృషి ఎనలేనిదని ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు కొనియాడారు. ప్రభుత్వ సాగునీటి సలహాదారుగా ఆయన విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. శుక్రవారం విద్యాసాగర్‌రావు 5వ వర్ధంతిని జలసౌధ, విద్యాసాగర్‌రావు భవన్లో వేర్వేరుగా నిర్వహించారు. జలసౌధలోని విద్యాసాగర్‌రావు విగ్రహానికి ఈఎన్సీ మురళీధర్, పలువురు ఇంజినీర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, పూర్వ అధ్యక్షుడు సంగెం చంద్రమౌళి, అసోసియేట్ అధ్యక్షులు తన్నీరు వెంకటేశం, రాంరెడ్డి, ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, ప్రొఫెసర్ రమణానాయక్, హైదరాబాద్ ఇంజినీర్స్ నాయకులు దేశబోయిన రమ, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఇంటర్‌స్టేట్ చీఫ్ ఇంజినీర్ మోహన్‌కుమార్, డిప్యూటీ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిత తదితరులు పాల్గొన్నారు.