హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్: సమతామూర్తి భగవద్రామానుజాచార్యులు అవతరించి వెయ్యేండ్లయిన సందర్భంగా ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ‘శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం’ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు త్రిదండి చినజీయర్‌స్వామి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఆశ్రమంలో నిర్వహించే ఉత్సవాలకు రాష్ట్రపతి, ప్రధానితోపాటు ఉప రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు దేశ, విదేశీ ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. సోమవారం ఆయన తన ఆశ్రమంలో చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభించిన అనంతరం మైంహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 5న రామానుజాచార్యుల భారీ పంచలోహ విగ్రహాన్ని (సమతావిగ్రహం) ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరించనున్న ట్టు చెప్పారు. 216 అడగుల ఎత్తైన ఈ విగ్ర హం ప్రపంచ అద్భుతంగా నిలుస్తుందని అ న్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.1,200 కోట్లు వెచ్చించి అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కుల, మతాల మధ్య విభేదాలు, ఉద్రిక్తతలు ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో రామానుజుడి బోధనలు సమాజానికి అవసరమని, సమాజంలో శాంతిని నెలకొల్పాలనే సంకల్పంతోనే సహస్రాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవాలలో భాగంగా 12 రోజుల పాటు 128 యాగశాలల్లో ఐదువేల మంది రుత్విక్కులు నాలుగు వేదాలు పారాయణం చేస్తారని తెలిపారు. హోమం, కోటిసార్లు నారాయణ జపం, కోటి హవన మహాక్రతువు, గోపూజలు నిర్వహిస్తామని వివరించారు. హోమంలో వినియోగించేందుకు వివిధ రాష్ర్టాల నుంచి రెండు లక్షల కిలోల దేశీ ఆవునెయ్యిని సేకరిస్తున్నామని వివరించారు. ఫిబ్రవరి 14న నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతారని చెప్పారు. డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ.. సమతామూర్తి విగ్ర హం ఆవిష్కరించడాన్ని పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అహోబిల జీయర్‌స్వామి, దేవనాధ జీయర్‌స్వామి, ఎన్నారై సంస్థల నిర్వాహకుడు ముక్కాముల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.