హైదరాబాద్, ఏప్రిల్ 10 ( నమస్తే తెలంగాణ): తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేతతో భక్తులు ఆందోళనకు దిగారు. ఆదివారం శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 12వ తేదీ వరకు ఇవ్వాల్సిన సర్వదర్శనం టోకెన్ల జారీ శనివారం పూర్తిచేశారు. ఆది, సోమ వారాల్లో టోకెన్ల జారీ నిలిపివేశారు. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు. ఇదిలావుండగా కరోనాతో రెండేండ్లుగా రద్దు చేసిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ పునరుద్ధరించింది. వీరికి టోకెన్లను ఆన్లైన్ ద్వారా జారీచేస్తున్నది.
ప్రముఖుల దర్శనం
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం లక్ష్మణ్, నావెల్ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, సినీనటులు జీవిత రాజశేఖర్ దంపతులు వారి కుమార్తెలు శివానీ, శివాత్మిక శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఎస్వీబీసీకి విరాళం…
అమెరికాకు చెందిన రవి ఐకా టీటీడీ ఎస్వీబీసీకి రూ.1.32 కోట్లు విరాళం అందజేశారు. దాత ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ విరాళం డీడీని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.