హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర నూతన సీఎస్ నియామకంపై కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు ప్రస్తుతమున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలను కూడా చూసుకోవాలని ప్రభుత్వం మరో ఉత్తర్వులో పేర్కొన్నది. ప్రస్తుత సీఎస్ ఏ శాంతికుమారి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న విషయం విధితమే.
కుడ్లిగి రామకృష్ణారావు 1991బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయనకు ఆర్థికపరమైన అంశాలు, ప్రభుత్వ పాలసీల అమలులో నైపుణ్యం ఉన్నది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం(ఐఎఫ్ఎంఐఎస్)ను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను అత్యంత పారదర్శకతతో విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. క్లిష్ట పరిస్థితులను సైతం అధిగమిస్తూ తెలంగాణను విజయపథాన పురోగమించేలా చేయడంలో తనవంతు కృషిచేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఆర్థి క శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత 12ఏండ్లుగా 13 వార్షిక బడ్జెట్లకు రూపకల్పన చేయడం ద్వారా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఇందులో 11 పూర్తిస్థాయి బడ్జెట్లు కాగా, రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ఉన్నాయి. నిరాటంకంగా 12 ఏండ్లుగా ఆర్థిక శాఖకు నేతృత్వం వహిస్తున్నందున ఆయనకు ఈ అవకాశం లభించింది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సమీకరణలో కీలకపాత్ర పోషించారు.
అంతేకాదు, రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ శాఖ బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా, విద్యాశాఖ డైరెక్టర్‌గా, వైద్య శాఖ, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ప్రణాళికాశాఖ బాధ్యతల్లో భాగంగా జీఐఎస్ వ్యవస్థను పటిష్ఠపర్చడంతోపాటు వివిధ శాఖలకు చెందిన సమగ్ర డేటా సేకరణ, విశ్లేషణ ద్వారా సరైన ప్రణాళికలు రూపొందించి, అమలు చేసేందుకు కృషిచేశారు. ప్రభుత్వ విధులు సక్రమంగా కొనసాగే విధంగా వివిధ శాఖలను సమన్వయపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. విధానాల రూపకల్పన, ఆర్థికపరమైన వ్యూహాలు, అభివృద్ధి ప్రాధాన్యతలు తదితర అంశాలపై ప్రభుత్వానికి సరైన సూచనలు, సలహాలు ఇస్తూ పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్‌గా దేశంలోని పలు రాష్ర్టాల్లో ఐటీ ఆధారిత సంస్కరణలు ప్రవేశపెట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఐఐటీ కాన్పూర్ నుంచి బీటెక్, ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్, అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. వచ్చే ఆగస్టు నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయనున్నారు.