హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : రామగుండంలో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ నిర్మాణం విషయంలో సర్కారు వెనక్కితగ్గింది. విద్యుత్తు ఉద్యోగుల ఆందోళనలు, అభ్యంతరాల నేపథ్యంలో సింగరేణి భాగస్వామ్యంతో కాకుండా.. టీజీ జెన్కో భాగస్వామ్యంతోనే ఈ ప్లాంట్ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ను సింగరేణి, జెన్కో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తామని గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే.
విధివిధానాల ఖరారుకు రెండు సంస్థల అధికారులతో ఓ కమిటీని సైతం నియమించారు. సింగరేణి భాగస్వామ్యాన్ని విద్యుత్తు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో టీజీజెన్కో ద్వారానే ఈ ప్లాంట్ను నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్లో కలిసి హర్షం వ్యక్తంచేశారు. జెన్కో ద్వారానే నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 1999 నుంచి 2004 వరకు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింజేయాలని, పదోన్నతులు కల్పించాలని వినతిపత్రం అందజేశారు.