బయ్యారం, అక్టోబర్ 15 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామ కాంగ్రెస్‌లో రెండు వర్గాల నాయకుల మధ్య ఇందిరమ్మ కమిటీల చిచ్చు రగిలింది. తాము సూచించిన వారినే కమిటీలో నియమించాలంటూ మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం బయట గొడవకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ముగ్గురి పేర్లు ఇవ్వాలని మాజీ ఎంపీటీసీ మంగీలాల్, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లును అధికారులు కోరారు. వారు తమ వర్గానికి చెందిన వేర్వేరు వ్యక్తుల పేర్లను సూచించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు తమపై పెత్తనం చేస్తున్నారని పాత కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తే.. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశామని, తమకు సముచిత స్థానం కల్పించాలని వాదించుకున్నారు. విషయం తేలకపోవడంతో కార్యదర్శి రామస్వామి ఇరువర్గాల పేర్లను ఉన్నతాధికారులకు అందించారు.
‘మేడ్చల్ మల్కాజిగిరి’లో చెరువుల సర్వే
మేడ్చల్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని చెరువుల బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ హద్దుల గుర్తింపు సర్వే కొనసాగుతున్నది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో మొత్తంగా 620 చెరువులు ఉన్నాయి. బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ హద్దుల గుర్తింపులో భాగంగా మొదటి దశలో 97 చెరువుల బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ హద్దుల గుర్తింపు పూర్తయింది. మరో 110 చెరువుల బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ హద్దుల గుర్తింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం వీటి బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ హద్దుల గుర్తింపు సర్వే కొనసాగుతున్నది. మిగతా 413 చెరువుల బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ హద్దుల గుర్తింపు సర్వేను మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నారు.