హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): గ్రామీణాభివృద్ధి, వ్యవసాయంతోపాటు పలు సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ రామచంద్ర మిషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును ఆదివారం ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా కలిశారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఆధ్యాత్మిక సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు.
సంస్థ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మిషన్ ప్రస్తుత ఆధ్యాత్మిక గురువు కమలేశ్పటేల్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ఆసక్తిని వ్యక్తంచేశారు. ఆ దిశగా పలు అంశాలపై సీఎం కేసీఆర్‌తో చర్చించారు. ఈ భేటీలో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గైడ్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ రెవరెండ్ దాజీ, మిషన్ జాయింట్ సెక్రటరీ వంశీ చలగుల్లా, ట్రస్టీ మాధవరెడ్డి, ప్రతినిధులు అనిలారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కన్హా తదితరులు పాల్గొన్నారు.