హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachandra Rao) అన్నారు. పార్టీని నమ్ముకున్నవారిని బీజేపీ ఎప్పుడూ మోసం చేయదని, అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. పార్టీ అభివృద్ధికి పని చేసిన వారందరికీ అవకాశాలు వస్తాయన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విధానాలు నచ్చనివారు పార్టీని వీడినా నష్టం లేదంటూ వ్యాఖ్యానించారు.
పంటి కింద రాయిలా పరిణమించిన గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్‌ను వదిలించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తీరుపై కేంద్ర నాయకత్వం మీద నిరసన గళం విప్పిన రాజాసింగ్ ఏకంగా పార్టీకి రాజీనామా చేస్తూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా స్పీకర్‌కు లేఖ రాసి తన అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయించాలని మాట్లాడారు. తాను ఇక ఏమాత్రం బీజేపీ సభ్యుడిని కానని కూడా ప్రకటించారు. దీంతో ఇదే అదునుగా ఆయనను పార్టీ నుంచి బయటకు పంపాలని రాష్ట్రంలోని పలువురు నేతలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది.
పలుమార్లు పార్టీని, పార్టీ నేతలను ఇరుకున పెట్టేలా వ్యవహరించిన రాజాసింగ్‌ను వదిలించుకోవడానికి ఇదే కలిసి వచ్చిన సమయమని వారు భావిస్తున్నట్టు సమాచారం. ఇంకెంతకాలం ఆయనను భరించాలని పలువురు నేతలు పార్టీ అధిష్ఠానం పెద్దల వద్ద ప్రస్తావించినట్టు తెల్సింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, సంస్థాగత వ్యవహారాల జాతీయ కార్యదర్శి తదితరులకు ఇదే విషయాన్ని రాష్ట్ర పార్టీ నివేదించినట్టు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీకి ఒక లేఖను కూడా పంపినట్టు తెలిసింది. లేఖపై సంతకం చేసిన వారిలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్, కొత్త అధ్యక్షుడు రాంచందర్‌రావు సహా ముఖ్య నేతలంతా ఉన్నట్టు చెప్తున్నారు. కేంద్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే స్పీకర్‌కు రాజాసింగ్‌పై పార్టీ నిర్ణయాన్ని వివరిస్తూ లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీ ఆదేశాలు వస్తే అప్పుడు స్పీకర్‌కు లేఖ ఇస్తామని బీజేపీకి చెందిన కీలక నేత ఒకరు ‘నమస్తే తెలంగాణ’తో ధ్రువీకరించారు.
గోషామహల్లో కూడా ఉప ఎన్నిక?
ఒకవేళ బీజేపీ కేంద్ర నాయకత్వం సమ్మతిస్తే జూలై నెలాఖరులోపే రాజాసింగ్ వ్యవహారం తేలిపోతుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీతోపాటు అసెంబ్లీ స్పీకర్ కూడా ఆయన రాజీనామాను ఆమోదిస్తే గోషామహల్లో ఉప ఎన్నిక తప్పదని తెలుస్తున్నది. జూబ్లీహిల్స్తోపాటే గోషామహల్‌కు కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉంటాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదల కానుంది. అప్పుడే రాష్ట్రంలోని ఈ రెండు నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.