హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): భారత సైనికుల పోరాటం పాక్ ఉగ్రవాదులపైనే కానీ, అక్కడి ప్రజలపై కాదని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు రాకా సుధాకర్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలకు జేజేలు పలకాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా రాకా సుధాకర్ బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
లక్ష్యాన్ని ఛేదించారు..
ఆపరేషన్ సిందూర్ చాలా రోజుల క్రితమే చేయాల్సింది. గతంలో మన సైనికులను చంపితే సరిహద్దు వరకు మాత్రమే వెళ్లి యుద్ధాలు చేశాం. కానీ, గత కొన్నేండ్లుగా యుద్ధంలో సైనికులు దూసుకుపోతున్నారు. సర్జికల్ ్రైస్టెక్ సమయంలో సరిహద్దు దాటి 25 కిలోమీటర్ల లోపలికి వెళ్లారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సమయంలో 70 కిలోమీటర్ల లోపలికి వెళ్లి మరీ పోరాడారు. ఈ సారి 9 తొమ్మిది చోట్ల 24 దాడులు చేసి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. గతంలో కేవలం పీవోకే పరిధిలోనే యుద్ధాలు జరిగేవి. కానీ, నేడు నేరుగా పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారు. మరో 30 వరకు ఉగ్రవాద స్థావరాలు మిగిలి ఉన్నాయి.
24 నిమిషాల్లోనే ముగించారు
భారత్ మీద దాడి చేస్తే.. తిరిగి దాడిచేసి, ఎయిర్‌ఫోర్స్‌ను కూడా ధ్వంసం చేస్తామని భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్‌ను హెచ్చరించింది. 24 నిమిషాలు జరిగిన ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి తిరిగివచ్చారు. భారత సైన్యానికి చెందిన ఏ ఒక్క విమానం కూడా ధ్వంసం కాలేదు. పాకిస్థాన్‌కు చెందినవే రెండు విమానాలు ధ్వంసమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్ సైనిక వ్యవస్థ చాలా గొప్పది. క్రమశిక్షణ, అద్వీతీయ నాయకత్వానికి మారుపేరు.
మాక్ డ్రిల్ అందుకే అవసరం
హైదరాబాద్ లాంటి ముఖ్యమైన ప్రాంతాలపై ఉగ్రవాదుల కన్ను నిరంతరం ఉంటుంది. ప్రభుత్వంతోపాటు ప్రజలు సైతం వారి చర్యలను తిప్పికొట్టాలి. స్వీయ రక్షణలో భాగమే మాక్ డ్రిల్స్. హైదరాబాద్‌లో నాలుగు రక్షణ స్థావరాలు ఉన్నాయి. వాటిలో డీఆర్డీవో, నూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్ఎఫ్సీ), సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ప్రాంతం, గోల్కొండ. ఈ నాలుగు ప్రాంతాల్లో దాడిచేసేందుకు ఆస్కారం ఎక్కువ. 1971 తర్వాత మళ్లీ ఇప్పుడు మాక్‌డ్రిల్స్ నిర్వహించారు. మాక్ డ్రిల్స్ అత్యంత కీలకం. బాంబు దాడులు సరిహద్దుల్లోనే జరగవు కదా.
అబద్ధాలు ప్రచారం చేయొద్దు
ఈ సమయంలో ప్రజలకు, ప్రభుత్వానికి వ్యత్యాసం లేదు. రెండూ ఒకటే. దేశ ప్రజలంతా దేశం కోసం పోరాటం చేయాలి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయొద్దు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వాటినే ప్రచారం చేయాలి. అన్నికంటే ముందు ప్రతి ఒక్కరూ మీ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. యుద్ధాల వల్ల తీరని ఆర్థిక నష్టం ఏర్పడుతుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
సాంకేతికంగా ముందున్నాం..
భారత సైన్యం సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతున్నది. గతంలో బాలాకోట్ ఘటనలో దాడి అనంతరం తిరిగివస్తున్న రెండు విమానాల్లో ఒకటి కుప్పకూలిపోవడంతో అభినందన్ పాక్‌లో చిక్కుకుపోయారు. అయినా కూడా భారత్ ఆయనను తీసుకొచ్చింది. నాటికి, నేటికి భారత సైన్యం సాంకేతికంగా మరింతగా బలపడింది.