హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : నౌకాశ్రయాలను సంస్కరించే లక్ష్యంతో కేంద్ర నౌకాయానశాఖ మంత్రి శరబానంద సోనోవాల్ ప్రవేశపెట్టిన ‘ఇండియన్ పోర్ట్స్-2025 బిల్లు’ను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ.. 1908 నాటి పాత బిల్లు లో సవరణలు చేయడం సంతోషకరమ ని అన్నారు. కేంద్రం దూరదృష్టితో తీసుకొచ్చిన బిల్లుతో కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. పీపీపీ పద్ధతిలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమమవుతుందని చెప్పారు.
తీరప్రాంత రాష్ట్రాల్లో రవాణా మెరుగుపడడం ద్వారా తెలంగాణకు సైతం మేలు జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్- ముంబై రైలు మార్గాల ద్వారా వస్తు రవాణా సేవలు వేగవంతమవుతాయని చెప్పారు. గోడౌన్ల నిర్మాణం, లాజిస్టిక్స్‌తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని విశ్లేషించా రు. భారతదేశ విశాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ ఈ బిల్లుకు సంపూర్ణంగా మద్దతిస్తుందని వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.