హైదరాబాద్/కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన లభిస్తుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చెప్పారు. కూకట్పల్లి కేపీహెచ్‌బీ ఫేజ్- 6లోని నెక్సెస్ హైదరాబాద్ మాల్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులకు ఆయన విత్తన గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ మాట్లాడుతూ.. గణేశ్ పండగ అంటే చిన్నారులకు అమితమైన ఇష్టమని, అలాంటి పండుగలో మంచి ఆశయాన్ని జత చేయాలనే ఆలోచనతో నాలుగేండ్ల క్రితం విత్తన గణేశ్ ప్రతిమల పంపిణీని ప్రారంభించామని చెప్పారు.
దానికి అనూహ్య స్పందన రావడం, చిన్నారులు, వారి తల్లిదండ్రులు సీడ్ గణేశుడి ప్రతిమలు కావాలని అడగడంతో ప్రతిసారి ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి చిన్నారి ఎంతో సంతోషంగా గణపతి ప్రతిమలను తీసుకొని మురిసిపోవడం చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుందని అన్నారు. కల్మషం లేని వారి మనసులో గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఒక సామాజిక బాధ్యతను నేర్పుతున్నందుకు చాలా గర్వంగా ఉన్నదని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్, కార్తికదీపం ఫేమ్ శౌర్య, పుష్ప సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ధ్రువన్, గోరూరల్ ఇండియా లిమిటెడ్ సంస్థ సీఈవో సునీల్, టీన్యూస్ ఎడిటర్ సురేశ్, చీఫ్ జనరల్ మేనేజర్ ఉపేందర్, గ్రీన్ ఇండియా చాలెంజ్ మెంబర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.