Ale Laxman | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిత్రాలను రాచరికపోకడలుగా చూడాల్సిన పనిలేదని, అవి తెలంగాణ ప్రజల సాంస్కృతిక, రాజకీయ వారసత్వానికి ప్రతీకలని ప్రస్తుత తెలంగాణ రాజముద్ర చిత్రకారుడు లక్ష్మణ్ ఏలె చెప్పారు. రాచరికం అంటూ వ్యతిరేకిస్తూ పోతే ఏ దేశానికీ చరిత్ర మిగలదని, అలా వాటిని ఒకే కోణంలో చూడలేమని స్పష్టంచేశారు. రాజముద్ర మార్పుపై గురువారం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘సాహసం, సాహిత్యం, కళలు, ముఖ్యంగా అజరామరమైన శిల్పకళకు నీరాజనం పట్టిన కాకతీయుల పాలనను మనం ఉద్యమకాలంలో గౌరవించుకున్నాం. చార్మినార్ను సమైక్య ప్రతీకగా నిలబెట్టుకున్నాం. వాటిని వదులుకోవడమంటే మన సంస్కృతిని కొంత వదులుకోవడమే.
తెలంగాణ అధికార ముద్ర నుంచి వాటిని తొలగించాల్సిన పని లేదు. వాటిని అలా ఉండనిచ్చి, తెలంగాణ ఉద్యమాలకు గుర్తుగా అమరవీరుల ప్రతీకను కూడా కలిపితే మంచిదే.’ అని లక్ష్మణ్ ఏలె పేర్కొన్నారు. ‘ఇప్పుడున్న రాజముద్రను డిజైన్ చేసిన వ్యక్తిగా నాకు ఆ చిహ్నంతో భావోద్వేగమైన బంధం ఉన్నది. కానీ, నేనీ మాటలు వ్యక్తిగత భావోద్వేగంతో చెప్పడం లేదు. నాకు ఏ రాజకీయ పార్టీతో కూడా ప్రమేయం లేదు. నాకు తెలంగాణ చారిత్రక సాంస్కృతిక అస్థిత్వం ప్రధానం. తెలంగాణ ఉద్యమంతో పేగు సంబంధం ఉన్న చిత్రకారుడిగా నాకు తెలంగాణ అస్థిత్వ ప్రజాచైతన్య వారసత్వ నేపథ్యం ఉన్నది. అందుకే ఈ రాజముద్రని చిత్రించేటప్పుడు తెలంగాణ ప్రతీకలుగా వాటిని సకల జనామోదంగా తీసుకొని తీర్చిదిద్దాం’ అని తెలిపారు. కొత్త చైతన్యం కోసం మార్పు కోరడం మంచిదేనని, అదే సమయంలో పాత సంస్కృతిని, పునాదులను మరిచిపోకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి అధికార ముద్ర మార్పును వాయిదా వేయడం మంచి నిర్ణయమని, తుది నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఈ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.