హైదరాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు సమీపంలోని తొర్రూర్, బహూదూర్పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లోని లేఔట్లలో ఇండ్ల నిర్మాణానికి అనువైన 163 ఖాళీ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్టు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం ప్రకటించారు.
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)కు అతి చేరువలోని తొర్రూర్ ప్రాంతంలో 200 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 125 ప్లాట్లు, కుర్మల్‌గూడలో 200-300 చదరపు గజాల విస్తీర్ణంలోని 25 ప్లాట్లు, బహదూర్‌పల్లిలో 200-1,000 గజాల్లోని 13 ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వెల్లడించారు. ఈ లేఔట్లలో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన పూర్తయిందని, ప్లాట్లపై ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. ఈ నెల 17, 18న పెద్ద అంబర్‌పేటలోని అవికా కన్వెన్షన్‌లో ప్లాట్ల వేలం జరుగుతుందని, ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.