రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ)/ఎల్లారెడ్డిపేట: ‘యాభై ఏండ్ల కింద అత్తమామలు భూమి కొంటే మాకెందుకీ శిక్ష. ఎలాంటి నోటీసులివ్వకుండా మేమేదో ఘోరమైన నేరం చేసినట్టు నా భర్తను జైలుకు పంపడం ఎంతవరకు న్యాయం? అని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెలకు చెందిన అబ్బాడి రాజిరెడ్డి భార్య లత కన్నీటి పర్యంతమైంది. రాజిరెడ్డిని జైలుకు పంపిన ఘటనపై ఆయన భార్య లత, కుమార్తెలు లావణ్య, రమ్య తెలిపిన వివరాలు ఇలా..
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన అబ్బాడి నారాయణరెడ్డి, బాలవ్వ దంపతులకు అదే గ్రామంలో సర్వే నంబర్ 1173/1లో మూడెకరాలు పట్టాభూమి ఉన్నది. వ్యవసాయమే జీవనాధారం. తమ పొలానికి ఆనుకుని ఉన్న 30 గుంటల వ్యవసాయ భూమి (సర్వేనంబర్ 1183/4/1/1)ని దంతె మల్లయ్య అనే రైతు వద్ద యాభై ఏండ్ల క్రితం కొనుగోలు చేసి సాగుచేసుకుంటున్నారు. కొన్న భూమిని తమ పేరు మీదకు మార్పిడి చేసుకోకుండానే సాగు చేసుకుంటూ వచ్చారు. కొన్నేండ్ల క్రితమే అనారోగ్యంతో నారాయణరెడ్డి, బాలవ్వ దంపతులు మృతి చెందారు.
వారి కొడుకు అబ్బాడి రాజిరెడ్డి వారసత్వంగా సక్రమించిన భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తల్లిదండ్రులు కొనుగోలు చేసిన 30 గుంటల భూమిని తన పేరుమీద మార్చుకునేందుకు 2017లో పీవోటీ, సాదాబైనామా చట్టం ప్రకారం అప్పటి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వీరికి భూమి అమ్మిన దంతె మల్లయ్య, అతని కొడుకు నర్సయ్య చనిపోవడంతో కోడలు వచ్చి రాజిరెడ్డి పేరుమీదకు భూమి మార్పిడి చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తహసీల్దార్ ముందు చెప్పడంతో అధికారులు రాజిరెడ్డి పేరుమీద మార్చి, పట్టాదారు పాసుబుక్కు అందించారు. 2017లో పేరు మార్పిడి చేసుకున్న రాజిరెడ్డి అప్పటినుంచి 3 ఎకరాల 30 గుంటల భూమిలో బోర్లు వేసుకుని సాగు చేసుకుంటూ వస్తున్నాడు.
మాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఉన్న భూమిలో కాస్తు చేసుకుంటూ బతుకుతున్నం. గుంట భూమి కూడా మేము కబ్జా చేయ్యలే. వారసత్వంగా వచ్చిన దాంట్లోనే సాగు చేసుకుంటున్నం. మా ఆయన పొలం కాడ ఉంటే పోలీసులు వచ్చి తీసుకపోయిండ్రు. ఏ తప్పు చెయ్యని నా భర్తను అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపిండ్రు. నా భర్త గొంతు సమస్యతో ఇబ్బంది పడుతుంటే 12 రోజుల కిందట ఆపరేషన్ చేయించినం. డాక్టర్ రాగి జావ తాగుమన్నడు, టైంకు గోలీలు వేసుకోవాలన్నడు. మాట్లాడితే ప్రాబ్లమైతదని చెప్పిండు. పేషంట్‌గా ఉన్న నా భర్తకు ఏమన్నయితే ఎవలు బాధ్యులు. ఇంటి పేరు అబ్బాడి అని ఉంటే తప్పు చేసినట్లా?
– అబ్బాడి లత (రాజిరెడ్డి భార్య)