హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అవినీతి నిరోధకశాఖ సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి ఆరోపించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం.. వారు చేస్తున్న పనితీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం సమాచార హకు చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
తెలంగాణ ఏసీబీ ఇటీవల పెద్దఎత్తున దాడులు చేస్తుందని, ఏడాదికాలంలో ఎంతమంది అధికారులను పట్టుకున్నారు? ఎంత డబ్బు దొరికింది? అని సమాచార హకు చట్టం కింద దరఖాస్తు చేస్తే.. తాము సమాచారం ఇవ్వలేమని ఏసీబీ కరాఖండిగా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని రాజేంద్ర కోరారు.