Mallanna Sagar | సిద్దిపేట : దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ఆధారంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ నిర్మాణం భేష్‌గా ఉందని రాజస్థాన్ నీటిపారుదల శాఖలకు చెందిన ఇంజినీర్ల బృందం అభినందించింది. శుక్రవారం రాజస్థాన్ నీటిపారుదల శాఖలకు చెందిన ఇంజినీర్ల బృందం మల్లన్నసాగర్‌ను సందర్శించింది. ఈఎన్సీ హరిరాం రాజస్థాన్ బృందానికి ప్రాజెక్టు విశేషాలు వివరించారు.
ఏడాదిలో 365 రోజులు మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో నీటి లభ్యత పుష్కలంగా ఉంటుందని, అందుకే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేండ్ల వ్యవధిలో తెలంగాణ సర్కారు పూర్తిచేసిందన్నారు. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు జలాలను తెచ్చి చెరువులు, కుంటల ద్వారా పొలాలకు అందిస్తున్నట్లు తెలిపారు. సాగునీటి లభ్యతతో రైతులు ధీమాగా పంటలు పండించుకుంటున్నట్లు ఈఎన్సీ హరిరాం రాజస్థాన్ బృందానికి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పరీశిలించిన రాజస్థాన్ ఇంజినీర్లు, ఇంత వేగంగా నిర్మించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బృందం వెంట ఈఎన్సీ హరిరాం, డీఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.