Telangana | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ‘మ్యూజికల్ చైర్’ ఆటను తలపిస్తున్నది. పదవిని ఆశిస్తున్న రేసుగుర్రాల జాబితాలో రోజుకో కొత్త పేరు వచ్చి చేరుతున్నది. అసలు నేతలు, వలస నేతలంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇక అధిష్ఠానం సైతం అదిగో.. ఇదిగో అంటూ నాన్చుతున్నది. దీంతో ఎవరికి వారు వర్గాలుగా విడిపోయిన కీలక నేతలు రాష్ట్ర అధ్యక్షపదవి కోసం కుమ్ములాటలకు దిగుతున్నారు. ఒకరి అవకాశాలను మరొకరు దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇటీవల కొత్త ఎమ్మెల్సీలతో భేటీ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంతి అమిత్‌షా పార్టీ నేతలను గట్టిగా మందలించినట్టు తెలిసింది. ‘మీరు ఉన్నదే కొద్ది మంది. చేస్తే మంచి రాజకీయాలు చేయండి. లేదంటే వెళ్లిపోండి. మేం కొత్త నాయకత్వం తయారుచేసుకుంటం’ అని ఓ స్థాయిలో క్లాస్ పీకినట్టు సమాచారం. అక్కడ తలూపిన నేతలు మళ్లీ రాష్ర్టానికి రాగానే ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
బీజేపీలో ఇద్దరు కీలక నేతలు మంటలు రాజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో బండి సంజయ్ మాట్లాడుతూ ‘నేను అధ్యక్ష రేసులే లేను’ అంటూనే ‘అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడమే క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తల పని’ అంటూ మనసులో మాట బయటపెట్టుకున్నారు. ‘కొంతమంది అధ్యక్షులం అవుతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు ఇది పార్టీ క్షమశిక్షణకు వ్యతిరేకం, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు’ అంటూ మరో వర్గానికి హెచ్చరికలు పంపించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం వెనుక శ్రమ అంతా తనదేనంటూ బండి ఢిల్లీ పెద్దల ముందు చెప్పుకున్నట్టు తెలిసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఫైనల్ చేసేది రాష్ట్ర కమిటీనా, లేక జాతీయ కమిటీనా అని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర కమిటీ ఎంపిక చేస్తే కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్‌గానే ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి పాత సామాన్లను బయటపడేయాలని అన్నారు. గతంలో పనిచేసిన అధ్యక్షుడు గ్రూప్ రాజకీయాలు చేసి పార్టీకి నష్టం చేశారని చెప్పారు. కొత్త బీజేపీ అధ్యక్షుడు అదే గ్రూపిజం చేస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఫ్రీహ్యాండ్ ఇస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో రహస్య భేటీలు నిర్వహించవద్దని హితవు పలికారు. పార్టీలో పెద్దల దృష్టికి తీసుకువచ్చినా వినకపోవడం వల్లే ప్రజల ముందు పెడుతున్నానని వివరించారు.
రాష్ట్ర అధ్యక్షపదవిని ఆశిస్తున్న వారంతా ప్రధానమంత్రి మోదీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇటీవలే కుటుంబంతో సహా వెళ్లి కలిసొచ్చారు. కానీ రాష్ర్టానికి చెందిన వారే ఈటలకు అధ్యక్ష పదవికి రాకుండా అడ్డుకున్నారన్నది ఆ పార్టీలో బహిరంగ రహస్యం. ఆ వెంటే మెదక్ ఎంపీ రఘునందనరావు సైతం కుటుంబంతో సహా మోదీని కలిశారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మొదటి నుంచి తనకు రాష్ట్ర అధ్యక్షపదవి ఇవ్వాలని కోరుతున్నారు. ధర్మపురి అర్వింద్ సైతం పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు చాలాకాలంగా ఆ పదవిపై ఆశ పెట్టుకున్నారు. కొత్తగా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు పేరు తెరపైకి వచ్చింది.