పెంచికల్పేట్, జూన్ 25: ఫర్టిలైజర్ యజమాని, కాంగ్రెస్ నాయకుడు రాచకొండ కృష్ణ వేధింపులు భరించలేకే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ గ్రామానికి చెందిన తుమ్మిడే రాజశేఖర్ (22) ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఫర్టిలైజర్ యజమాని, కాంగ్రెస్ నాయకుడు రాచకొండ కృష్ణ ఇంటి ఎదుట బుధవారం ఉదయం నుంచి కుటుంబసభ్యులు, గ్రామస్థులు ధర్నాకు దిగారు. ఈ ఆందోళనకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఫర్టిలైజర్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్న రాజశేఖర్‌పై యజమాని కృష్ణ దొంగతనం నిందమోపడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.