TGPSC | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల కోసం కాంగ్రెస్ సర్కారుపై చావో, రేవో తేల్చుకుంటాం.. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాడుతాం.. అమలు చేయకుంటే ఆ ప్రభుత్వం గద్దె దిగేదాకా పోరుబాట వీడబోము.. అని నిరుద్యోగులు ప్రతినబూనారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్వీ నేతలు, నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేసి, బలవంతంగా వ్యాన్లలో గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ఈ సందర్భంగా వారంతా ముక్తంకఠంతో నినదించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలకు దిగుతామని నిరుద్యోగులు శపథం చేశారు. హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని ధ్వజమెత్తారు. అంతకు ముందు నిరుద్యోగుల తరఫున టీజీపీఎస్సీని బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్, రాజారామ్యాదవ్తోపాటు పలువురు కార్యకర్తలు ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసుల భారీ బందోబస్తును, బారికేడ్లు, ముండ్లకంచెలను ఛేదించుకుంటూ టీజీపీఎస్సీని ముట్టడించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినదించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.
నిరుద్యోగుల దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. తిరిగి అదే నిరుద్యోగుల ఆగ్రహంతో కూలిపోతుందని నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్‌నాయక్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచిందని, తాను తొమ్మిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినా ఈ సర్కారు కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువత ఆశలను అడియాశలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాకొద్దని తేల్చిచెప్పారు. టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చిన ఆయననూ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం దిగిరావాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గత ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చిందని, ఇప్పుడా హామీలను నెరవేర్చడానికి రాహుల్‌గాంధీ రావాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. లేకపోతే న్యూఢిల్లీలో రాహుల్‌గాంధీని నిలదీయడానికి చలో న్యూఢిల్లీ కార్యక్రమం చేపడతామని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని పాతాళలోకంలో పడేస్తామని హెచ్చరించారు. ‘హలో నిరుద్యోగి.. చలో న్యూఢిల్లీ’ ముట్టడి కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడుతామని ప్రకటించారు.