హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సోషల్‌మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తప్పుబట్టారు. సోషల్‌మీడియా జర్నలిస్టులను అవమానించడం సబబుకాదని, సామాజిక బాధ్యతతో పనిచేసే వారిని గౌరవించాలని హితవు చెప్పారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్‌మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప.. అవమానించడం సబబుకాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్‌మీడియా మొదటినుంచీ తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉన్నది. నిబద్ధతతో పనిచేసే సోషల్‌మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్‌మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు’ అని రాజగోపాల్‌రెడ్డి ట్వీట్ చేశారు.