Raja Singh | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైందా? రాష్ట్ర నేతలపై వరుస వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలకు రాష్ట్ర కమిటీ ఫైల్ సిద్ధం చేసిందా? ఆ ఫైల్‌ను రెండ్రోజుల్లో హైకమాండ్‌కు పంపనున్నదా? అంటే బీజేపీ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో అగ్గి రాజేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నియమిస్తే రబ్బర్ స్టాంప్‌గానే మిగిలిపోతాడని, గతంలో ఉన్న అధ్యక్షుడు గ్రూప్‌లు కట్టారని, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ముఖ్యమంత్రిని కొందరు బీజేపీ ముఖ్య నేతలు రహస్యంగా కలుస్తారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌రావును ప్రకటించడంపై రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా గులాంగిరి చేసేవారికే పోస్టులు, టికెట్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. వరుసగా పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్న రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పార్టీ శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాష్ట్ర నాయకత్వం భావించి ఫైల్ సిద్ధం చేసినట్టు సమాచారం. మరో రెండ్రోజుల్లో ఈ ఫైల్‌ను హైకమాండ్‌కు పంపనున్నట్టు, వారం రోజుల్లో సస్పెన్షన్ వేటు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.