హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ సాగు ముగింపు దశకు చేరుకున్నది. ఇప్పటికే పత్తి, కంది, ఇతర పంటల సాగు పూర్తి కాగా, వరి సాగు కొనసాగుతున్నది. మరో వారం పది రోజులపాటు వరినాట్లు పడే అవకాశం ఉంది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 59.66 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 44.78 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది.
ఇక 5.35 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.66 లక్షల ఎకరాల్లో కంది, 4.44 లక్షల ఎకరాల్లో సోయాబీన్ పంటలు సాగయ్యాయి. నిరుడితో పోల్చితే ఈ సీజన్లో పంటల సాగు తగ్గింది. జూన్లో వర్షాభావ పరిస్థితులతోపాటు ఆగస్టులోనూ వర్షాలు కరువయ్యాయి. దీంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి ఊపిరిపోసినట్టు అయ్యింది. గతేడాది ఇదే సమయానికి 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇక ఈ సీజన్లో 13 జిల్లాలు 100 శాతానికిపైగా సాగును నమోదు చేశాయి.