హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసినట్టు అధికారులు తెలిపారు. 27న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 28న ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వానలు కురుస్తాయని పేరొంది. 29, 30 తేదీల్లో పలుచోట్ల భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే సూళ్లకు సెలవులు ఇవ్వటానికి అధికారులు సిద్ధమయ్యారు. గడిచిన 24 గంటల్లో ములుగు, వరంగల్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ములుగుజిల్లా కన్నాయిగూడెంలో 4.36 సెం.మీ వర్షంపాతం నమోదైంది.
మాలలకు అన్యాయం జరగకుండా చూడండి ; సీఎంకు మాల సామాజికవర్గ ప్రతినిధుల విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాల సామాజిక వర్గం నేతలు కోరారు. సోమవారం సచివాలయంలో ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మట్టా రాగమయి, వంశీకృష్ణ, నాగరాజు, మాల మహానాడు నేత చెన్నయ్య సీఎంతో భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై కోర్టు తీర్పునకు అనుగుణంగా మాల, మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. కమిటీని నియమించి అధ్యయనం చేసి, నివేదిక ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.