హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం మెదక్ జిల్లాలో వడగండ్ల వాన, వికారాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో రెండు రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఈ నెల 18 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
జూన్లో సాధారణ వర్షపాతమే ఉంటుందని తెలిపారు. గురువారం అత్యధికంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో 7.4సెం.మీ, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతిలో 6.8 సెం.మీ, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 5.5సెం.మీ, ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలో 5.3 సెం.మీ, మధిర మండలం శ్రీపురంలో 5.2సెం.మీ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకీసలో 5.2సెం.మీ వర్షం కురిసింది. హైదరాబాద్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది.