TG Weather | తెలంగాణలో పలుచోట్ల రాగల మూడురోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చియ వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య ప్రదేశ్ వరకు వ్యాపించిందని.. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. రాబోయే 24గంటల్లో తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా పశ్చియ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే, సగటు సముద్రమట్టం వద్ద రుతుపవన ద్రోణి జైసల్మేర్, కోట, నర్మదాపురం, సియోని, చాంద్బలీ మీదుగా అల్పపీడన ప్రాంతం కేంద్రం మీదుగా తూర్పు ఆగ్నేయం వైపు వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని.. సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి.. ఉపరితల ఆవర్తనంగుండా ప్రయాణిస్తుందని పేర్కొంది. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర మీదుగా ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ప్రయాణిస్తుందని.. మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉందని వివరించింది.
గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని వివరించింది. గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిశాయి.