హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తేతెలంగాణ): నైరుతి రుతుపవనాల తిరోగమనం సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో రాబోయే వారం రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు రాష్ర్టాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పలు రాష్ర్టాలకు భారత వాతావరణశాఖ ఎల్లో, రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి శనివారం పలు రాష్ర్టాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రాగల రెండురోజుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.