హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతోపాటు తిరోగమనంలో ఉన్న నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా ఉండటం వల్ల కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నాగర్కర్నూల్, వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి.
హైదరాబాద్ శివారులో వరద నీటిలో కొట్టుకుపోతున్న వాహనదారులను స్థానికులు కాపాడారు. శుక్ర, శని వారాల్లో కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ప్రాథమిక హెచ్చరిక జారీచేసింది.