హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): వచ్చే వానకాలంలో రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. క్లస్టర్లవారీగా ఏ పంటలను, ఎంత విస్తీర్ణంలో సాగుచేయాలో కూడా నిర్ణయించారు. ఆ దిశగా రైతులను ప్రోత్సహించడంతోపాటు సాగుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వానకాలం పంటల సాగు ప్రణాళికలపై మంత్రుల నివాస సముదాయంలో వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి నిరంజన్‌రెడ్డి శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారని, ఈ ఏడాది ఆ దిశగా పోత్సహించాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో వచ్చే వానకాలంలో 70-75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాలని, అందుకు 1,332 క్లస్టర్లను గుర్తించాలని చెప్పారు. వెయ్యికిపైగా క్లస్టర్లలో 50 లక్షల ఎకరాల్లో వరిని, 82 క్లస్టర్ల పరిధిలో 15 లక్షల ఎకరాల్లో కందిని, 11.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్టు వెల్లడించారు. ఆయా పంటలకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పచ్చిరొట్ట ఎరువులను ప్రోత్సహించి భూసారం పెంచేదిశగా రైతులను సన్నద్ధంచేయాలని తెలిపారు. మే నెలలో వీటిని రైతులకు పంపిణీ చేయాలని, కల్తీ లేని నాణ్యమైన విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని, అందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.
పంటల ప్రణాళిక ప్రకారం ఎరువులను సిద్ధంగా ఉంచాలని, మే నెలాఖరు నాటికి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పంటల ప్రణాళికలపై జిల్లాలవారీగా ఏఈవోలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. మే నెలలో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు బంధు సమితుల భాగస్వామ్యంతో వానకాలం పంటల ప్రణాళికపై క్లస్టర్లవారీగా రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులునిర్వహించాలని వెల్లడించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, విత్తన సంస్థ ఎండీ కేశవులు, మార్క్‌ఫెడ్ ఎండీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.