హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. రెండు, మూడురోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈ నెల 4 వరకు వాయువ్య బం గాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని, 2, 3, 4 తేదీల్లో కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాలు కురి సే అవకాశాలున్నాయన్న ఐఎండీ అంచనా ఫలించనున్నది.