హైదరాబాద్ : జంటనగరాల పరిధిలో శనివారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. మెహదీపట్నం, బంజారాహిల్స్, గుడిమల్కాపూర్, లంగర్ హౌస్, గోల్కొండ, ఖైరతాబాద్, అంబర్పేట, బాగ్ అంబర్పేట, కూచికూడలో వానపడింది. అబిడ్స్, నాంపల్లి, కోఠి, బషీర్బాగ్, ఖైరతాబాద్, నారాయణగూడ, అఫ్జల్గంజ్, గోషామహల్, మంగల్హాట్, సికింద్రాబాద్, పద్మారావ్నగర్, చిలుకలగూడ, సీతాఫల్మండి, వారాసిగూడ, బౌద్ధనగర్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. నీరు నిల్వకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. రాబోయే మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.