నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం(Heavy Rain) కురుస్తున్నది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాల్లో జోరు వానతో రైతులు బెంబే లెత్తిపోతున్నారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసి ముద్ధ అవుతుండడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. కాగా, రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(TS Weather ) తెలిపింది.
ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.