హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడ్రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటనలో పేర్కొన్నది. గురువారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్,
పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు పేర్కొన్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడిచిన 24గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, కొత్తగూడెం, టేకులపల్లి మండలాల్లో 7 సెం.మీ, ముల్కలపల్లిలో 6 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 6 సెం.మీ, పెద్దపల్లి జిల్లా పెద్దపల్లిలో 5 సెం.మీ, ధర్మారంలో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది.