Rain Alert | రాష్ట్రంలో వైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలు పెరుగుతుండడంతో జనం వేడికి అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ని అందించింది. తెలంగాణలో రాగల మూడురోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని పేర్కొంది. పశ్చిమ రాజస్థాన్ నుంచి విదర్భ వరకు ఉన్న ద్రోణి ప్రస్తుతం పశ్చిమ రాజస్థాన్ నుంచి తూర్పు రాజస్థాన్ మీదుగా కోస్తాంధ్ర వరకు కొనసాగుతోందని, ఉపరితల ఆవర్తనం వాయువ్య మధ్యప్రదేశ్-విదర్భ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని చెప్పింది. ఎగువ ఉపరితల ఆవర్తం నుంచి ఒక ద్రోణి ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కీం, పరిసర పాంత్రాల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని హెచ్చరించింది. 13న మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. 14న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.