Viral News | కాజీపేట : సాధారణంగా రైలు ఎక్కే సమయంలో, ప్రయాణ సమయంలో నగలో, డబ్బులు పోయాయని ఫిర్యాదు చేసిన సంఘటనలున్నాయి. కానీ, ఓ వ్యక్తి విచిత్రంగా రైలు ఎక్కుతున్న సమయంలో చెప్పు ఎక్కడో పడిపోయిందని, వెతికి ఇవ్వాలంటూ అధికారులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు చెప్పును గుర్తించి తీసుకువచ్చి ఇచ్చారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే జంక్షన్లో చోటు చేసుకున్నది.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన ఓ ప్రయాణికుడు గురువారం కాకతీయ రైలు ఎక్కుతున్న క్రమంలో చెప్పు జారిపోయింది. ఈ విషయంపై ట్విట్టర్లో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రైల్వే బోర్డు, సెక్యూరిటీ అధికారులకు సంబంధిత శాఖ సిబ్బంది ప్రయాణికుడి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలను జారీ చేశారు. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణికుడి పడిపోయిన చెప్పును శనివారం రాత్రి అప్పగించారు.