SCR | పెద్దపల్లి జిల్లా రాఘవాపురం – రామగుండం మధ్య రైల్వేలైన్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బుధవారం రాత్రి అప్‌లైన్‌ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. రాఘవపురం – రామగుండం మధ్య గూడ్స్ రైలును నడిపించిన అధికారులు విజయవంతంగా నడిపించారు. ఘటన జరిగిన దాదాపు 23 గంటల తర్వాత రైలు వెళ్లింది. మరికొద్ది గంటల్లో డౌన్ మార్గం సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.
పెద్దపల్లి – రామగుండం మధ్య రాఘవాపూర్ మధ్య గూడ్స్ రైలు బోల్తాపడింది. ఐరన్ కాయిల్స్‌తో వెళ్తున్న రైలు ఓవర్ లోడ్‌తో 11 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. ట్రిపుల్ లైన్ మధ్య నుంచి వెళ్తున్న గూడ్స్ అప్, డౌన్ మార్గాలపై బోల్తా కొట్టింది. బళ్లారి నుంచి ఘజియాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. దాంతో ఢిల్లీ, చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాదం నేపథ్యంలో అధికారులు పలు రైళ్లను దారి మళ్లించడంతో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.