హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు మగ్గిపోతున్న తీరును, కేసీఆర్ పాలనను కోరుకుంటున్న విధానాన్ని తెలుపుతూ సినీనటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతులపై అణచివేత ధోరణిని కనబరుస్తున్న ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. రాహుల్ రామకృష్ణ పోస్ట్‌పైనా అదే ధోరణి కనబర్చారని సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. తెలంగాణలో ఇందిరమ్మ పాలన పేరుతో రేవంత్‌రెడ్డి అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై రాహుల్ రామకృష్ణ తన అభిప్రాయాలను గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం.
డబుల్ డోర్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నా. వచ్చి పరిస్థితులను చక్కదిద్దండి’ అంటూ పోస్ట్ చేసి, మాజీమంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ‘హైదరాబాద్ మునిగిపోయింది. హామీలన్నీ విఫలమయ్యాయి. వీటన్నింటినీ చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు’ అంటూ మరో పోస్ట్ పెట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ట్యాగ్ చేశారు. ఆ తర్వాత కాసేపటికి ‘నేను విసిగిపోయాను.. నన్ను చంపేయండి’ అని భావోద్వేగంగా స్పందించారు. మరో ట్వీట్లో ‘ఈ ప్రపంచంలో ద్వేషం ఉండకూడదు. మనం మానవులమే. ప్రేమతో జీవించాలి’ అని పేర్కొన్నారు. రాహుల్ రామకృష్ణ తన ట్వీట్స్ ద్వారా వ్యక్తం చేసిన భావాలకు విపరీతమైన మద్దతు లభించింది. సగటు తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా రాహుల్ పోస్ట్ చేశారంటూ తెలంగాణవాదులు, నెటిజన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. రాహుల్ రామకృష్ణ ధైర్యంగా ప్రజల తరఫున ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారని అభినందించారు.
ప్రభుత్వ పనితీరుపై పరోక్షంగా విమర్శలు సంధిస్తూ ఎక్స్‌లో పోస్టులు చేసిన తర్వాత రాహుల్ రామకృష్ణకు బెదిరింపులు వచ్చినట్టు తెలిసింది. కొందరు రాజకీయ నేతలు కూడా రాహుల్‌కు కాల్ చేసి, వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. కొందరు నేరుగా ఎక్స్‌లోనే అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్‌రెడ్డి అనుచరులు హద్దుమీరి చేసిన కామెంట్ల నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ఖాతాను శుక్రవారం ఉదయం డీయాక్టివేట్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వంలోని ముఖ్యనేత తెరవెనుక ప్రమేయం ఉన్నట్టు తెలిసింది. సినిమా రంగానికి చెందిన ఓ ప్రముఖుడు, ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉండే నిర్మాత ద్వారా రాహుల్ రామకృష్ణకు ఫోన్ చేయించి, పోస్ట్‌లు డిలీట్ చేసేలా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా కొన్ని యూట్యూబ్ చానెళ్లలో కథనాలు వచ్చాయి. సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వంలోని కొందరు పెద్దల మధ్య వరుస వివాదాలు నెలకొంటున్న తరుణంలో అదే ‘సినీపెద్ద’ ద్వారా రాయబారాలు నడపడం ఇటీవల పరిపాటిగా మారిందని తెలిసింది.
ఇప్పుడు కూడా రాహుల్ రామకృష్ణకు ఆ పెద్ద నిర్మాత ద్వారానే ఫోన్ చేయించారంటూ సోషల్‌మీడియాలో చర్చ నడుస్తున్నది. సినీరంగంలో ఉంటే సామాజిక అంశాలపై ప్రశ్నించకూడదా? వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి సినీ పరిశ్రమలో ఉండేవాళ్లు అర్హులు కాదా? ప్రశ్నించిన వాళ్లకు సినీపెద్దలతో ఫోన్ చేయించడమంటే.. పరిశ్రమలో అవకాశాలు లేకుండా చేస్తామని బెదిరించడం కాదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తున్నదని నిప్పులు చెరుగుతున్నారు. అలాగే రాహుల్ రామకృష్ణపై తెలంగాణవాదులు ప్రశంసలు కురిపించారు. సెలెబ్రిటీలు నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడటం అభినందనీయమని కొనియాడారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ శుక్రవారం సాయంత్రం తన ఎక్స్ ఖాతాను రీయాక్టివేట్ చేశారు. కానీ అతడు చేసిన పోస్టులు మాత్రం కొందరు ఒత్తిడి చేసి మరీ డిలీట్ చేయించినట్టు తెలిసింది. కొందరు పోలీసు అధికారులు కూడా రాహుల్ రామకృష్ణకు ఫోన్ చేసి బెదిరించినట్టుగా పలువురు డిజిటల్ జర్నలిస్ట్‌లు కథనాలు వెలువరించారు.