Revanth Cabinet | హైదరాబాద్, జూన్10 (నమస్తే తెలంగాణ) : మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ కట్టబెడతారనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో హట్ టాపిక్‌గా మారింది. ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఏ ఇద్దరు కలిసినా శాఖల కేటాయింపులపైనే చర్చించుకుంటున్నారు. ఫైల్ పట్టుకుని రేవంత్‌రెడ్డి విమానమెక్కడంతో ఈ చర్చ మరింత ఊపందుకున్నది. పాత మంత్రుల శాఖల్లో ప్రక్షాళన చేసి కొత్త వారికి ఇస్తారా? లేదంటే, ముఖ్యమంత్రి వద్ద ఉన్నశాఖలను కేటాయిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. మొదటి రోజు కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపిన సీఎం మంగళవారం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీని కలిశారు. ఈ క్రమంలో అనూహ్యంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, ఆ తర్వాత కాసేపటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. ఆ వెంటనే ఉత్తమ్ తన భార్య పద్మావతితో వెళ్లగా, భట్టి మరో విమానంలో ఢిల్లీ వెళ్లారు. మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉన్నదని సమాచారం. అధిష్ఠానం నుంచి పిలుపు రావడం వెనుక మంత్రులకు శాఖల కేటాయింపేనా? లేదంటే పార్టీపరంగా ఎదైనా కీలక మార్పు ఉండబోతున్నదా? అన్నది కాంగ్రెస్ వర్గాల్లో సస్పెన్స్‌గా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్ వద్దనున్న శాఖల్లో హోంశాఖ, విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు కీలకమైనవి. వీటిని వదులుకునేందుకు ఆయన ససేమిరా అంటున్నట్టు తెలిసింది. తప్పని పరిస్థితుల్లో వీటిని మంత్రులకు కేటాయించాల్సి వస్తే ఆ శాఖలను రెండుముక్కలుగా చేసి తల భాగం తన వద్దే అట్టిపెట్టుకొని, మొండాన్ని మాత్రం మంత్రులకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. హోంశాఖ నుంచి లా అండ్ ఆర్డర్‌ను వేరుచేసి దానిని తన వద్ద ఉంచుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. అది పోగా మిగిలిన విభాగాలన్నిటినీ హోంశాఖ పేరుతో మరో మంత్రికి కేటాయించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, మున్సిపల్ శాఖను మాత్రం వదులుకునేందుకు సీఎం ఇష్టపడటం లేదని సమాచారం. ఒకవేళ తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తే మాత్రం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ను ఒక శాఖగా, అర్బన్ డెవలప్మెంట్ను మరో శాఖగా విభజించి.. అర్బన్ డెవలప్మెంట్శాఖను తనకు ఇవ్వాలని అధిష్ఠానాన్ని సీఎం కోరినట్టు సమాచారం.
ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో శాఖల ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా అధిష్ఠానం మాత్రం ప్రక్షాళన అవసరమేనని స్పష్టం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం వద్దనున్న కీలక శాఖలను మంత్రులకు పంచాలని రాహుల్‌గాంధీ తేల్చి చెప్పినట్టు సమాచారం. సీనియర్ నేతలకు అప్పగించిన శాఖల్లో అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారి శాఖలు మార్చాలని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, శ్రీధర్‌బాబుకు పాలనలో మరింత బాధ్యత పెంచాలని సూచించినట్టు సమాచారం. దీంతో వారి శాఖల్లో మార్పులు చేర్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖ, విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, ఎస్సీఎస్టీ మైనార్టీ వెల్ఫేర్, న్యాయశాఖ, కార్మిక శాఖ, పశుసంవర్ధక శాఖ, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన సర్వీస్‌లతో పాటు మరికొన్ని కీలక శాఖలు ఉన్నాయి. వీటిలో హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలను సీనియర్ మంత్రులకు ఇవ్వాలని అధిష్ఠానం సూచించినట్టు తెలిసింది.