సంగారెడ్డి, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం విద్యార్థులను కలవరపెడుతున్నది. కాలేజీలో కొంతకాలంగా ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారు. బుధవారం మెడికల్ కాలేజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ఫైనల్, థర్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు అతడి కుటుంబంపైనా దాడికి యత్నించడం కలకలం రేపింది. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మంగళవారం సాయంత్రం ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిపారు. హాస్టల్లో సైతం విద్యార్థులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ విద్యార్థులు ఇద్దరు మొదటి సంవత్సరం విద్యార్థులను తమ గదుల్లోకి పిలిపించుకుని ప్యాంట్, షర్ట్ విప్పాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. సంగారెడ్డికి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థి సీనియర్ల వైఖరిని తప్పుబడుతూ ర్యాగింగ్ చేయడం తప్పని వారించాడు. దీంతో కోపోద్రిక్తులైన సీనియర్ విద్యార్థులు అతడిపై దురుసుగా వ్యవహరించినట్టు సమాచారం.
సీనియర్లు ర్యాగింగ్ చేయడాన్ని అవమానకరంగా భావించిన ఆ విద్యార్థి విషయాన్ని బుధవారం తన సోదరుడు, స్నేహితులకు తెలిపాడు. దీంతో వాళ్లు ర్యాంగింగ్కు పాల్పడిన సీనియర్ విద్యార్థులను తమ ఇంటికి రప్పించుకుని ఘటన గురించి ఆరాతీశారు. మెడికల్ కాలేజీ సీనియర్ విద్యార్థులకు ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో బాధిత విద్యార్థి ఇంటికి వెళ్లి మరోమారు దాడికి యత్నించారు. అడ్డుకునేందుకు యత్నించిన తండ్రి, సోదరుడిపైనా దాడిచేయగా పోలీసులు చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య మీడియాతో మాట్లాడుతూ.. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్టు విద్యార్థులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కాలేజీలో చోటుచేసుకున్న ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులను పిలిచి విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. విచారణ అనంతరం కేసు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సొంత జిల్లాలో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గురుకులంలో విద్యార్థులకు కౌన్సెలింగ్: భువనగిరి ఆర్డీవో
యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట గురుకుల పాఠశాలలో శనివారం అర్ధరాత్రి టెన్త్ విద్యార్థిపై ఇంటర్ విద్యార్థులు దాడికి దిగిన ఘటనపై బుధవారం అధికారులు, పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి మాట్లాడారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో టెన్త్ విద్యార్థి రావడంతో వివాదానికి దారి తీసిందని చెప్పారు. గొడవపడిన విద్యార్థులు క్షమాపణలు చెప్పారని, మరోసారి ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా పరీక్షలకు ప్రిపేర్ అవుతామని చెప్పడంతో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్రమశిక్షణ కమిటీ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.