బీఆర్ఎస్ నాయకుడు సురేశ్ కుట్రపూరితంగా వ్యవహరించి వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయించాడు. – లగచర్ల ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ప్రకటన. సురేష్ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అనుచరుడు అనేది వారు చెబుతున్న కారణం.
లగచర్ల ఘటనలో పోలీసులు రిమాండు చేసిన వారిలో ఓ పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు. పేరు రాఘవేందర్. దౌల్తాబాద్ మండలం సంగాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి. మరి… ఇతను ప్రభుత్వ ఉద్యోగి. అంటే దాడి చేసిన వారిలో రాఘవేందర్ ఉన్నాడని పోలీసులే చెబుతున్నందున ఘటన వెనక ప్రభుత్వం ఉందనుకోవాలా? దీనిపై ప్రభుత్వ పెద్దలు ఏమంటారు?! ఇదీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సంధిస్తున్న ప్రశ్నలు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ప్రభుత్వంపై అన్నదాతల తిరుగుబాటును కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలు బూమరాంగ్ అవుతున్నాయి. ముఖ్యంగా రైతుల ఆగ్రహం, ఆవేదనను వక్రీకరిస్తూ దానిని బీఆర్ఎస్ నేతలపై నెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆదిలోనే ఫోన్‌కాల్స్ వ్యవహారం బెడిసికొట్టగా, పోలీసులు రిమాండు చేసిన వారిలో పంచాయతీ కార్యదర్శి కూడా ఉండటంతో అమాయక రైతులు తమ భూములు కాపాడుకునేందుకే లగచర్ల లడాయికి దిగారే తప్ప దీని వెనక ఎవరి కుట్రలేదనేది మరోసారి రుజువైంది. రిమాండు రిపోర్టులో పంచాయతీ కార్యదర్శి పేరును పోలీసులు ప్రస్తావించినప్పటికీ.. ఆ సమయంలో సంబంధిత శాఖకు కనీస సమాచారం ఇవ్వకపోవడం ఒకవంతైతే, పోలీసు ఉన్నతాధికారులు మీడియా ముందు మాట్లాడిన సమయంలో రైతుల్లో ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడనే విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. సదరు పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ ఉద్యోగరీత్యా దౌల్తాబాద్ మండలం సంగాయిపల్లిలో పని చేస్తున్నారు.
వాస్తవానికి ఆయనది దుద్యాల మండలం లగచర్ల గ్రామం. రాఘవేందర్‌కు రెండెకరాల భూమి ఉన్నట్టు తెలిసింది. భూసేకరణలో రాఘవేందర్ భూమి కూడా పోతున్నట్టు తెలిసింది. పోలీసులు రిమాండు రిపోర్టులో ఎ-26గా రాఘవేందర్ పేరు చేర్చారు. ఈ మేరకు తొలి విడతలోనే 16 మందిని రిమాండు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు అనేకసార్లు మీడియాతో మాట్లాడారు. కానీ ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బీఆర్ఎస్ నేత సురేశ్ ఈ ఘటనకు సూత్రధారి అంటూ పలుసార్లు చెప్పారు. అదేరీతిలో మంత్రులు, ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సురేశ్ పేరు ప్రస్తావించి బీఆర్ఎస్పై రాజకీయ దాడి చేశారు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి దాడి ఘటనలో ఉన్నారని స్వయానా పోలీసులే చెబుతున్నందున ఇది రాజకీయ ప్రేరేపిత దాడి కాదనేది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగిని రిమాండు చేసే సమయంలో కచ్చితంగా పోలీసులు ఆయన పని చేసే శాఖకు సమాచారం ఇవ్వాలని పలువురు సీనియర్ అధికారులు చెబుతున్నారు. రిమాండు చేసిన కొన్ని రోజుల తర్వాత శనివారం తమకు సమాచారం ఇచ్చారని, రాఘవేందర్‌ను సస్పెండ్ చేసేందుకు ప్రతిపాదనలు కలెక్టర్‌కు పంపినట్టు వికారాబాద్ డీపీవో చెబుతున్నారు. అందుకు అనుగుణంగా శనివారమే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు.
లగచర్ల ఘటనలో తొమ్మిది నెలల నిండు గర్భిణీ జ్యోతి గాధ ప్రతిఒక్కరినీ కదిలిస్తుండగా… తాజాగా సస్పెండ్ అయిన పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ భార్య అఖిల పరిస్థితి కూడా అందరినీ కలిచివేస్తుంది. ఆ కుటుంబానికి ఉన్న రెండెకరాల భూమి ఫార్మా కంపెనీలో పోతుందనే బాధ ఒకవైపు… దాడి ఘటనలో పోలీసులు తన భర్తను జైలుకు పంపిన వేదన మరోవైపు… దాడిలో పాల్గొన్నాడని కలెక్టర్ ప్రతీక్‌జైన్ రాఘవేందర్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం ఇంకోవైపు… ఇన్ని బాధల మధ్య రాఘవేందర్ భార్య అఖిల లగచర్లలో సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ ముందు తన గోడు వెల్లబోసుకునేందుకు 3 నెలల పసికందుతో వచ్చారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్‌కు తన ఆవేదన వెల్లడించగా… తప్పకుండా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
నా భర్త రాఘవేందర్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. దాడితో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఏనాడూ ఎలాంటి గొడవలకు పోడు. సంఘటన జరిగిన రోజు ఆయన సంగాయిపల్లిలో సర్వే పనులు నిర్వహించి రాత్రి ఇంటికి వచ్చాడు. పోలీసులు రాత్రి ఇంటిలో చొరబడి ఎంత చెప్పినా వినకుండా అరెస్టు చేశారు. కలెక్టర్ మీద దాడికి పోతడా? అని రెండు రోజుల కిందట సస్పెండ్ చేసినట్టు ఉత్వర్వులు ఇచ్చినరు. భూమి పోతున్నంత మాత్రాన సంబంధం ఉందని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వ ఉద్యోగిని ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తరా? ఎట్ల సస్పెండ్ చేస్తరు? సంటి పిల్లను పెట్టుకొని ఎవరికి చెప్పుకోవాల్నో అర్థమైతలేదు. నా భర్తను వెంటనే విడుదల చేయాలి. – అఖిల